Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 23, 2013

ప్రకటన 7వ అధ్యాయము


1  అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు  దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని 
2  మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో
3  ఈ దూత - మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
4  మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
5  యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,
 6  ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,
 7  షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,
 8  జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
 9  అటు తరువాత నేను చూడగా, ఇదిగో,  ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రకులు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి 
10  సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
11  దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;
12  యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.
13  పెద్దలలో ఒకడు - తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
14  అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను - వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
15  అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
16  వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
17  ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
    Download Audio File

No comments:

Post a Comment